వడ్డీ జలగలపై చర్యలెప్పుడు..?
అనుమతుల్లేకుండా దందా
పేద–మధ్యతరగతి వర్గాల నుంచి ఆర్థిక దోపిడీ
పోలీసులు, అధికారులు స్పందిస్తారా..?
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా కొంతమంది వడ్డీ వ్యాపారులు దందా కొనసాగిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘కాకతీయ’లో ప్రచురితమైన వడ్డీ జలగలు కథనం తర్వాత బాధితుల మధ్య తీవ్ర చర్చ మొదలైంది. అధిక వడ్డీల పేరుతో సామాన్య ప్రజలపై అక్రమాలు, అగాయిత్యాలకు పాల్పడుతున్నారని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సాధారణంగా రూపాయికి ఒకటి లేదా రెండు రూపాయలకంటే ఎక్కువ వడ్డీ వసూలు చేస్తే చట్టరీత్యా శిక్షార్హమేనని నిబంధనలు చెబుతున్నాయి. అయినప్పటికీ జిల్లాలో కొందరు వడ్డీ వ్యాపారులు మితిమీరిన వడ్డీలు వసూలు చేస్తూ, అప్పు పేరుతో పేదల సొంత ఆస్తులు కూడా లాక్కుంటున్నారని బాధితులు వాపోతున్నారు. అయినా సంబంధిత అధికారులు, పోలీస్ శాఖ ఇప్పటివరకు గట్టి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాధితుల ఆవేదన
ఇప్పటికే పలువురు బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారని తెలుస్తోంది. ఫిర్యాదు చేస్తే మరింత వేధింపులకు గురవుతామన్న భయంతో చాలామంది మౌనంగా ఉండిపోతున్నారని సమాచారం. వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందని, ఈ దిశగా తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. వడ్డీ జలగలపై జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్ యంత్రాంగం ఎప్పుడు దృష్టి సారిస్తారన్నది ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ప్రధాన చర్చాంశంగా మారింది.


