పిల్లలతో వెట్టిచాకిరి చేస్తే క్రిమినల్ కేసులు
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి పోరాటం
బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్–100కు సమాచారం ఇవ్వాలి
జనవరి 1 నుంచి 31 వరకు ‘ఆపరేషన్ స్మైల్’
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
కాకతీయ, కొత్తగూడెం : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటుపడాలని, చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తే కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే 1098 లేదా డయల్–100కు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్, హెల్త్ డిపార్ట్మెంట్ల అధికారులతో శుక్రవారం ఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ రోహిత్ రాజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, ఇల్లందు, మణుగూరు అనే ఐదు సబ్ డివిజన్లలో ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేసి సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
బాలల రక్షణే లక్ష్యం
18 సంవత్సరాల లోపు పిల్లలు కిరాణా షాపులు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ కనిపిస్తే వెంటనే గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా అవసరమైతే చైల్డ్ కేర్ హోమ్‌కు తరలిస్తామని తెలిపారు. రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలను కూడా గుర్తించి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. చిన్నపిల్లలతో బలవంతంగా భిక్షాటన చేయించడం, వెట్టిచాకిరి చేయించిన వారిపై నూతన చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. బాలల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్–100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. చిన్నపిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారి ముఖాల్లో చిరునవ్వులు నిలిచేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.
సమావేశంలో ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ రాము, డీడబ్ల్యూవో స్వర్ణలత లెనినా, సిడబ్ల్యూసీ సభ్యులు అంబేద్కర్, సాదిక్ పాషా, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు షర్ఫుద్దీన్, డీసీపీవో హరి కుమారి, చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ సందీప్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామ్స్ మాధవరావు, కెఎస్‌సీఎఫ్ కో–ఆర్డినేటర్ రాజేష్, షీ టీం ఎస్సై రమాదేవి, ఎస్సైలు విజయ, రాజేష్, సమ్మిరెడ్డి, రాఘవయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


