భద్రకాళి ఆలయ టికెట్లలో గోల్‌మాల్
గడువు ముగిసిన మ్యానువల్ టికెట్లతో దర్శనాలకు అనుమతి
లక్షల్లో ఆదాయం.. లెక్కలే లేవా..?
నగదు లావాదేవీలతోనే అవినీతికి దారి..?
భక్తులకు ప్రశ్నలకు సమాధానం చెప్పని దేవాదాయ శాఖ అధికారులు
వివాదాస్పదంగా ఆలయ అధికారుల తీరు..!
సమగ్ర విచారణకు భక్తుల డిమాండ్
కాకతీయ, వరంగల్ బ్యూరో : చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ భద్రకాళి దేవాలయంలో టికెట్ కౌంటర్ల నిర్వహణ మరోసారి తీవ్ర వివాదాస్పదంగా మారింది. దర్శన టికెట్ల జారీ, ప్రసాదాల విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు భక్తుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. కొత్త టికెట్లు ముద్రించలేదని, మాన్యువల్ టికెట్లు జారీ చేస్తున్నామని అధికారులు చెబుతుండగా… వాస్తవానికి పాత టికెట్లనే తిరిగి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత టికెట్లపై కొత్త తేదీలు ఎలా ముద్రిస్తున్నారు?, వాటి లెక్కలు ఎక్కడ నమోదు అవుతున్నాయి?, అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవని భక్తులు నిలదీస్తున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద గందరగోళం రోజురోజుకీ పెరుగుతుండటంతో దేవాలయ పరిపాలనపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
పండుగ రద్దీ.. ఆదాయం భారీగా
సంవత్సరాంతం సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో భద్రకాళి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ రెండు రోజుల్లో లడ్డు, పులిహోర ప్యాకెట్ల విక్రయాలు సుమారు రూ.10 లక్షల వరకు జరిగినట్లు సమాచారం. అయితే ఈ మొత్తం ఎలా వసూలు అయింది?, ఎంత మొత్తం బ్యాంక్‌లో జమ అయింది? అన్న వివరాలపై స్పష్టత లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆదాయం లక్షల్లో ఉన్నా లెక్కలు మాత్రం కనిపించకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. టికెట్ కౌంటర్ల ఆధునీకరణకు బ్యాంక్ అధికారులతో సంప్రదించాల్సి ఉందని చెబుతున్న దేవాలయ అధికారులు, 20 రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ జాప్యం వెనుక ఏమైనా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నగదు లావాదేవీలే అవినీతికి దారి..?
డిజిటల్ చెల్లింపులు అమలు చేయకుండా నగదు లావాదేవీలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అవినీతికి అవకాశం పెరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగదు రూపంలో వసూలు చేసిన మొత్తం పూర్తిగా లెక్కల్లోకి వస్తుందా అన్న అనుమానాలు భక్తుల్లో బలపడుతున్నాయి. భక్తుల సంఖ్య, ఆదాయం పెరుగుతున్నా దేవాలయ పరిపాలన మాత్రం తూతూ మంత్రంగా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చినా ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోలేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.
సమగ్ర విచారణకు డిమాండ్
టికెట్ కౌంటర్లు, ప్రసాదాల విక్రయాలు, నగదు లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలన, బ్యాంక్ స్టేట్మెంట్ల ఆడిట్, పండుగ రోజుల ఆదాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. భక్తుల విశ్వాసంతో చెలగాటం ఆడితే సహించబోమని హెచ్చరిస్తూ, దేవాలయ పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని భక్తులు కోరుతున్నారు.


