అధికారులకు రాజభోగాలు… అర్చకులకు అర్థాకలి
అర్చకులకు ‘ఒకే శాఖ–ఒకే వేతనం’ న్యాయం చేయాలి
జీవో–121 రద్దు చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్ వర్తింపజేయాలి
రాష్ట్ర అర్చక జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ
జీవో–577 అమలులో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
నూతన దేవాదాయ చట్టం తేవాలని డిమాండ్
వరంగల్ ఉమ్మడి జిల్లా సదస్సులో గళమెత్తిన అర్చక జేఏసీ
కాకతీయ, కాజీపేట : దేవాలయ వ్యవస్థకు మూలస్తంభాలైన అర్చక ఉద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ‘ఒకే శాఖ–ఒకే వేతన విధానం’ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అర్చక ఉద్యోగుల సదస్సు పాతర్లపాడు నరేష్ శర్మ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ విశిష్ట అతిథిగా, రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సదస్సులో జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ.. 2017లో ప్రభుత్వం జారీ చేసిన జీవో–577 ప్రకారం 686 దేవాలయాల్లో పనిచేస్తున్న 5,625 మంది అర్చక ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు అందాల్సి ఉందన్నారు. కానీ నేటికీ కేవలం 3,327 మందికే వేతనాలు అందుతున్నాయని, మిగిలిన 2,223 మందిని దేవాదాయ శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆరోపించారు. జీవో–121ను అడ్డం పెట్టుకుని 1,500 మందికి పైగా అర్చకులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఆ జీవోను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అధికారులకు రాజభోగాలు… అర్చకులకు అర్థాకలి
జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ మాట్లాడుతూ దేవాదాయ శాఖలో నెలకొన్న అసమానతలను తీవ్రంగా ఎండగట్టారు. కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్న దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీసం రూ.1,500 వేతనం కూడా అందని దుస్థితి ఉందన్నారు. అదే ఆదాయం నుంచి 12 శాతం ఈఏఎఫ్ ద్వారా అధికారులు మాత్రం ట్రెజరీ జీతాలు, పెన్షన్లు, హెల్త్ కార్డులతో అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం మంది అర్చకులు కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదవ షెడ్యూల్ ప్రకారం నూతన దేవాదాయ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని నేతలు స్పష్టం చేశారు. అధికారులకే కాదు, హిందూ ధర్మ పరిరక్షకులైన అర్చకుల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని చట్ట సవరణ జరగాలని, ‘ఒకే శాఖ–ఒకే వేతనం’ సూత్రాన్ని చట్టబద్ధం చేయాలని వరంగల్ వేదికగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు గట్టు శ్రీనివాసాచార్యులు, రవీంద్రాచార్యులు, వెల్ఫేర్ బోర్డు సభ్యులు కృష్ణమాచారి, శ్రావణ కుమారాచారి, నారాయణస్వామి, జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ, ఉపాధ్యక్షులు టక్కరి సత్యం, టీఎన్జీవోస్ నాయకులు ఆకుల రాజేందర్, సోమన్న తదితరులు పాల్గొన్నారు.


