త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు
తొలి రైలు గౌహతి-కోల్‌కతా మధ్య అందుబాటులోకి..
ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నట్లు ప్రకటించింది. తొలి రైలు గౌహతి-కోల్‌కతా మధ్య అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం ప్రకటించారు. ఈ రైలు సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘వందే భారత్ స్లీపర్ రైలు టెస్ట్ డ్రైవ్ పూర్తైంది. త్వరలో ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. తొలి రైలు గౌహతి-కోల్‌కతా మధ్య అందుబాటులోకి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ మార్గంలో వందే భారత్ స్లీపర్ రైలు సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. వందే భారత్ స్లీపర్.. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మెరుగైన భద్రత, రాత్రిపూట సుదూర ప్రయాణాలకు ఆధునిక ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది’ అని తెలిపారు. జనవరి 18-19 తేదీల్లో ఈ ప్రారంభోత్సవం ఉండొచ్చని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
వందేభారత్ స్లీపర్@182 కేఎం
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. 2019లో ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలో రైల్వేశాఖ స్లీపర్ వర్షన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు మరికొన్ని రోజుల్లో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ రైలుకు ట్రయల్ రన్స్ చేపడుతున్నారు. రైలు వేగాన్ని పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాజస్థాన్ కోటా-నాగ్దా సెక్షన్ల మధ్య ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్ విజయవంతమైనట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పరీక్షల్లో రైలు గరిష్ఠంగా గంటకు 182 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఈ హైస్సీడ్‌లో వాటర్ టెస్ట్ కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. రైలు హైస్పీడ్‌తో దూసుకెళ్తున్నప్పటికీ నీళ్లతో నిండుగా ఉన్న గ్లాసులు మాత్రం తొణకకుండా స్థిరంగా ఉన్నట్టు వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ప్రత్యేకతలు..
వందే భారత్ స్లీపర్ రైలుకు చాలానే ప్రత్యేకలున్నాయి. విమానం తరహాలో ప్రయాణికులు ఈ రైలులో సౌకర్యాలుంటాయి. ఈ రైలు ముందు విలాసవంతమైన హోటల్స్ సైతం దిగదుడుపేనని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రైలు గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నది. వందే భారత్ స్లీపర్ రైలులో ఒకేసారి 823 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఒక ఫస్ట్ ఏసీ కోచ్, నాలుగు సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. వందేభారత్ రైలును గంటకు 160 నుంచి 200 కి.మీ. స్పీడ్‌తో వెళ్లేలా తయారుచేశారు. దాంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనున్నది. రైలులో ఫైర్ సేఫ్టీతో పాటు ప్రతి బెర్త్ వద్ద అత్యవసర స్టాప్ బటన్స్ సైతం ఉంటాయి. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు బెర్తులను మెరుగైన కుషన్‌తో ఏర్పాటు చేశారు. అప్పర్ బెర్తులు ఎక్కేలా మెట్లు ఏర్పాటు చేశారు. దాంతో ప్రయాణికులకు సరికొత్త అనుభవాన్ని అందించనున్నాయి. అలాగే, రైలులో అత్యాధునిక సేవలు అందించనున్నారు. బయో వాక్యూమ్ టాయిలెట్లు, టచ్ ఫ్రీ ఫిట్టింగ్‌లు, షవర్ క్యూబికల్స్, ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారిత డిస్‌ప్లేలు, ఛార్జింగ్ సాకెట్లు వంటి సౌకర్యాలు ఈ మరింత ఆకర్షణీయంగా ఏర్పాటు చేస్తున్నది.


