కరీంనగర్ కమిషనరేట్‌కు రాష్ట్ర సేవా పతకాల పంట
మహోన్నత సేవా పతకాలకు అడిషనల్ డీసీపీ (ఏఆర్) ఎం. భీంరావు
అడిషనల్ డీసీపీ (అడ్మిన్) పి. వెంకట రమణ
ఉత్తమ సేవ పతకాల్లోనూ పలువురి ఎంపిక
ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు ఎంపిక
విధి నిర్వహణలో ప్రతిభ, అంకితభావానికి గుర్తింపు
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందనలు
కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పోలీస్ సేవా పతకాల జాబితాలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన అధికారులు, సిబ్బంది భారీ సంఖ్యలో చోటు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. విధి నిర్వహణలో అసమానమైన ప్రతిభ, అంకితభావం, ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఎంపిక చేసింది. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పలువురు ఉన్నతాధికారులు మహోన్నత సేవా పతకాలను సాధించారు. అడిషనల్ డీసీపీ (ఏఆర్) ఎం. భీంరావు, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) పి. వెంకట రమణ ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి ఎంపికయ్యారు.
ఉత్తమ సేవలకు ప్రత్యేక గుర్తింపు
ఉత్తమ సేవలందించినందుకు సబ్ ఇన్‌స్పెక్టర్ సయ్యద్ అన్వర్ (సీటీసీ), సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. శ్రీనివాస్ (చిగురుమామిడి), హెడ్ కానిస్టేబుల్ ఇ. చుక్కా రెడ్డి (సీసీఆర్‌బీ)లకు ఉత్తమ సేవా పతకాలు లభించాయి.
కఠినమైన విధులను సమర్థంగా నిర్వహించినందుకు గాను పలువురు ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కఠిన సేవా పతకాలకు ఎంపికయ్యారు. హుజూరాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ టి. కరుణాకర్, సీసీబీ ఇన్‌స్పెక్టర్ వి. శ్రీనివాస్, కరీంనగర్ ఐ-టౌన్ ఎస్‌ఐ ఎ. సత్యనారాయణతో పాటు వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది ఈ జాబితాలో ఉన్నారు.
పోలీస్ కమిషనర్ అభినందనలు
ఈ సందర్భంగా సేవా పతకాలు సాధించిన ప్రతి ఒక్కరినీ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు. ఈ అవార్డులు భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా పనిచేసేందుకు ప్రోత్సాహం ఇస్తాయని, ఇతర సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు ఈ గౌరవం దక్కడం గర్వకారణమని తెలిపారు.


