జిల్లాను టాప్‌లో నిలపాల్సిందే..!
2026కు సరికొత్త ప్రణాళికలతో ముందుకు
సమన్వయంతో పాలనకు కలెక్టర్ పిలుపు
పౌరసేవల్లో నాణ్యత పెంచాలన్న ఆదేశం
కలెక్టరేట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : 2026 సంవత్సరంలో సరికొత్త ప్రణాళికలతో జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా జిల్లా అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. గురువారం కలెక్టరేట్ ఆవరణంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి పౌరసేవలను మరింత మెరుగుపరచాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో సృజనాత్మకతను ప్రతిబింబించాలని అధికారులకు పిలుపునిచ్చారు. ప్రతి శాఖ తమ పరిధిలోని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఇతర శాఖలతో సమన్వయం పెంచుకోవాలన్నారు. ప్రజలకు అందే సేవల్లో వేగం, పారదర్శకత ఉండాలని, అభివృద్ధి ఫలాలు చివరి అంచున ఉన్నవారికి చేరేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.
కలెక్టరేట్‌లో వేడుకల సందడి
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కేక్ కట్ చేసి ఉద్యోగులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అధికారులు, సిబ్బంది కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సానుకూల వాతావరణంలో కార్యాలయ పనితీరును మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. అనంతరం టీజీఓ, టీఎన్జీవో, ట్రెసా యూనియన్ల ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్లు, డైరీలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఉద్యోగుల సంక్షేమం, సేవాభావంతో కూడిన పాలనకు తమ వంతు సహకారం అందించాలని యూనియన్ నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ ఇంచార్జ్ డీఆర్‌డీఓ రామ్‌రెడ్డి, ఆర్డీవోలు ఉమారాణి, సుమ, వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్లు, టీఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


