‘బయటకు ఎలా పొక్కింది?’
ప్రశాంతంగా అధికారి వసూళ్లపై ఆరా
కాకతీయ కథనంతో ఉలిక్కిపడ్డ విద్యుత్ శాఖ..!
అక్రమ వసూళ్ల వ్యవహారంపై శాఖలో కలకలం
కాంట్రాక్టర్ వర్గాల్లోనూ చర్చ.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందా..?
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలంలో వ్యవసాయ విద్యుత్ సదుపాయాల పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ శాఖలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ‘పొలం బాట’ పేరుతో రైతులపై భారం మోపుతూ ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలపై ‘కాకతీయ’లో కథనం ప్రచురితమైన వెంటనే శాఖలో అంతర్గతంగా పెద్ద చర్చ మొదలైంది. రైతుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారనే వార్తతో “ఎవరు తీసుకున్నారు..? ఎక్కడ తీసుకున్నారు..?” అన్న ప్రశ్నలు అధికార వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
రైతులనే గుచ్చి గుచ్చి ప్రశ్నలు
విశ్వసనీయ సమాచారం ప్రకారం… సదరు ఏఎల్ఎం స్థాయి ఉద్యోగి తనపై వచ్చిన ఆరోపణలతో తీవ్ర అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. ప్రశాంతంగా ముడుపులు తీసుకుని వ్యవహారం ముగిసిందనుకున్న అతడు, కథనం వెలువడిన వెంటనే రైతులను స్వయంగా సంప్రదించి “మీరు ఎవరికి చెప్పారు..? ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారా..? ఈ విషయం బయటికి ఎలా వచ్చింది..?” అంటూ ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేసినట్టు సమాచారం. రైతులు ఈ ఒత్తిడితో మరింత భయాందోళనకు గురవుతున్నారని తెలుస్తోంది.
కాంట్రాక్టర్ వర్గాల్లోనూ టెన్షన్
ఇదే సమయంలో ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతున్న కాంట్రాక్టర్ వర్గాల్లోనూ అశాంతి నెలకొంది. “మా పేరు ప్రస్తావించారా..? డబ్బుల వివరాలు బయటికి వెళ్లాయా..?” అన్న ఆందోళనతో కొందరు పరుగులు పెట్టినట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. పై అధికారుల దృష్టికి వ్యవహారం చేరుతుందనే భయంతో సంబంధిత వర్గాలు పరిస్థితిని సర్దుబాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. కాకతీయ పత్రికలో కథనం వెలువడిన తర్వాత పలువురు ఉన్నతాధికారులు కూడా మంగపేట పరిణామాలపై ఆరా తీసినట్టు వినిపిస్తోంది. గతంలోనే అవినీతిపై కఠిన చర్యల హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఈ వ్యవహారాన్ని అధికారులు ఎలా స్వీకరిస్తారన్నది ఆసక్తిగా మారింది. రైతులకు నిజంగా న్యాయం జరుగుతుందా..? లేక వ్యవహారం మళ్లీ మామూలుగా మారిపోతుందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు మాత్రం తమకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాన్నే వ్యక్తిగత లాభాల సాధనంగా మార్చడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తమ పరిస్థితిని బయటకు చెప్పుకోలేని స్థితిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఉన్నతాధికారుల నిర్ణయాలపైనే నిలిచింది. మంగపేట అక్రమ వసూళ్ల వ్యవహారం ఎటు దారితీస్తుంది..? కఠిన చర్యల దిశగా అడుగులు పడతాయా..? లేక మళ్లీ మామూలేనా..? అన్నది వేచి చూడాల్సిందే.


