రూ. 736 కోట్ల లిక్కర్ సేల్
రాష్ట్ర ఖజానాకు కిక్కిచ్చిన కొత్త సంవత్సరం
న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు
గత ఆరు రోజుల్లోనే రూ.1,350 కోట్ల మద్యం విక్రయం
మూడ్రోజుల్లో దాదాపు రూ.వెయ్యి కోట్ల వ్యాపారం
డిసెంబర్‌లోనే రూ.3,805 కోట్ల సేల్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కొత్త సంవత్సరం రాష్ట్ర ఖజానాకు కిక్కిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కనివినీ ఎరగని రీతిలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఆరు రోజుల్లోనే రూ.1,350 కోట్ల విలువైన మద్యం తాగేశారు. గత మూడు రోజుల్లోనే వెయ్యి కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మూడు రోజుల్లో 8.30 లక్షల లిక్కర్ కేసులు, 7.78 లక్షల బీర్ల కేసులు విక్రయించారు. నూతన సంవత్సరం సందర్భంగా వైన్ షాప్‌ల వద్ద జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి. గతం కంటే ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పలుచోట్ల రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. వైన్ షాప్‌ల వద్ద మందుబాబుల రద్దీ కనిపించింది. గతేడాది ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.3,805 కోట్లు విలువైన 38.07లక్షల కేసుల లిక్కర్, 45.09లక్షల కేసులు బీర్లు అమ్ముడు పోయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.
తగ్గేదేలే..
న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతూ మద్యంప్రియులు ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు ఫుల్‌గా తాగేశారు. డిసెంబర్ 31న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మద్యం ఏరులై పారింది. మధ్యాహ్నం నుంచే మందుబాబులు దుకాణాల వద్ద బారులు తీరారు. గతేడాది కంటే అధికంగా లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఈ ఆరు రోజుల్లోనే ఏకంగా రూ.1350 కోట్ల విలువైన మద్యం తాగేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మద్యం సేల్స్ పెరిగాయి. 2025 చివరి రోజు 736 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. కొన్నిచోట్ల మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయి.
2,731 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటిన వేళ శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తాగి వాహనాలు నడుపుతున్న వారి కోసం హైదరాబాద్ వ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. పోలీసులను దూరం నుంచే చూసి పలువురు వెనక్కి తిరిగి పారిపోగా పలువురు మందు బాబులు చిక్కినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో 2,731 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,198, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 928, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 605 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లుగా పోలీసులు వివరించారు.


