కాకతీయ పెరిక పరపతి సంఘం మహాసభ
కుల భవన నిర్మాణంపై చర్చ..
7వ వార్షికోత్సవ ఏర్పాట్లకు శ్రీకారం
కాకతీయ, ఖిలావరంగల్ : ఖిలావరంగల్ తూర్పుకోట కొత్తగడ్డలో కాకతీయ పెరిక పరపతి సంఘం ఆధ్వర్యంలో గురువారం మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, సంఘ నాయకులు, యువత పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతిపాదించిన కుల భవన నిర్మాణం అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. కుల భవనం నిర్మాణం ద్వారా సామాజిక ఐక్యత మరింత బలోపేతం అవుతుందని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణానికి అవసరమైన స్థలం ఎంపిక, నిధుల సమీకరణ, ప్రభుత్వ సహకారం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న కాకతీయ పెరిక పరపతి సంఘం 7వ వార్షికోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా సభా స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. రానున్న వార్షికోత్సవ సభను విజయవంతం చేయడానికి ప్రతి సభ్యుడు బాధ్యతగా పనిచేయాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు. మహాసభ అనంతరం సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ ద్వారా సంఘ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో కాకతీయ పెరిక పరపతి సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారు. భవిష్యత్‌లో సంఘాన్ని మరింత బలోపేతం చేసి, సామాజిక అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.


