ఓటర్ల జాబితా ఈ మ్యాపింగ్‌లో అప్రమత్తత అవసరం
లోటు పాట్లకు తావు లేకుండా పనులు పూర్తి చేయాలి
మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కాకతీయ, కరీంనగర్ కార్పోరేషన్ : ఓటర్ల జాబితా టీ పోల్, ఈ మ్యాపింగ్ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అధికారులు, సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో 66 డివిజన్ల ఓటర్ల జాబితాకు సంబంధించిన ఆన్‌లైన్ ఈ మ్యాపింగ్ ప్రక్రియను ఆయన స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ మ్యాపింగ్ పోర్టల్‌లో ఓటర్ల డేటాను పొందుపరుస్తున్న విధానాన్ని కమిషనర్ దగ్గరుండి పరిశీలించారు. అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేస్తూ ముసాయిదా ఓటర్ల జాబితా తయారీలో చిన్నపాటి పొరపాట్లు కూడా జరగకుండా మ్యాపింగ్ చేపట్టాలని స్పష్టం చేశారు. ఇచ్చిన డేటాను డివిజన్ వారీగా పోలింగ్ బూత్‌ల ప్రకారం ఖచ్చితంగా నమోదు చేయాలని మ్యాపింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సక్రమంగా జాబితా రూపొందించాలని ఆదేశించారు. ప్రతి ఓటర్ వివరాన్ని ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాతే డేటా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, టౌన్ ప్లానింగ్ ఏసీపీలు వేణు, శ్రీధర్, టీపీఎస్‌లు తేజస్ని, సంధ్య, టీపిబీవోలు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


