మేయర్ పీఠం బీజేపీ దే
కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం
సర్వే ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు
పైరవీలు, గొడవలు చేస్తే షోకాజ్ తప్పదు
టికెట్ల పేరుతో మోసాలకు తావు లేదు
రాంగ్ స్టెప్ వేస్తే రాజకీయ భవిష్యత్తే ప్రమాదం
కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు
బోగస్ ఓట్లపై ప్రత్యేక దృష్టి.. బెంగాల్ తర్వాత లక్ష్యం తెలంగాణే
కేంద్ర హోం సహయశాఖ మంత్రి బండి సంజయ్
కరీంనగర్‌లో మున్సిపల్ ఎన్నికలపై సన్నాహక సమావేశం
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలపై కాషాయ జెండా ఎగరేయడమే బీజేపీ లక్ష్యం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని తీరుతాం అంటూ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్‌లోని త్రిధా హోటల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల పట్టణ జోన్ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లడుతూ. టిక్కెట్ల విషయంలో ఈసారి పైరవీలు, ఒత్తిళ్లకు ఎలాంటి చోటు లేదని బండి సంజయ్ తేల్చిచెప్పారు. టిక్కెట్లు ఇప్పిస్తామని ఎవరైనా చెప్పినా నమ్మొద్దని పార్టీ నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సర్వే రిపోర్టుల ఆధారంగా గెలిచే అవకాశమున్న అభ్యర్థులకే టిక్కెట్లు కేటాయిస్తామని తనకు గానీ కుటుంబ సభ్యులకు గానీ ఫోన్లు చేస్తే టిక్కెట్లు కూడా దక్కవని కఠిన హెచ్చరిక చేశారు. టిక్కెట్లు రాలేదని ఆవేశంతో పార్టీని వీడితే రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. టిక్కెట్లు దక్కకపోయినా పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల ద్వారా పూర్తి న్యాయం చేస్తామని ఈసారి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువ మంది నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కేలా కృషి చేస్తానని ప్రకటించారు. వ్యక్తిగత ఆశలకన్నా పార్టీ విజయం ముఖ్యమని క్రమశిక్షణతో పనిచేస్తేనే రాజకీయంగా ఎదుగుదల సాధ్యమవుతుందన్న స్పష్టమైన సంకేతాలను బండి సంజయ్ ఇచ్చారు.
రాంగ్ స్టెప్ వేస్తే షోకాజ్
కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టే
టిక్కెట్లు రాలేదనే ఆవేశంతో పార్టీని వీడితే రాజకీయ భవిష్యత్తే నాశనం అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో గొడవలకు దిగే నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అలాంటి వారిపై వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. బ్లాక్ మెయిల్, బెదిరింపులకు తాను లొంగే రకం కాదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అభివృద్ధి విషయంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలోనూ చేసిందేమీ లేదని బండి సంజయ్ మండిపడ్డారు. మున్సిపాలిటీల్లో కనిపిస్తున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరుగుతోందని స్పష్టం చేస్తూ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం లేని బీఆర్ఎస్‌కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టేనని ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలను బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని బండి సంజయ్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో బోగస్ ఓట్లు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక అప్రమత్తత అవసరమని సూచించారు. డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాలను సేకరించి ఇంటింటికీ వెళ్లి పరిశీలించాలన్నారు. బోగస్ ఓట్లు గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
బెంగాల్ తర్వాత లక్ష్యం తెలంగాణే
బెంగాల్, తమిళనాడు ఎన్నికల అనంతరం బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి మొత్తం తెలంగాణపైనే కేంద్రీకృతం కానుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తూ తెలంగాణలో పార్టీ గెలుపుతోనే కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యం సంపూర్ణమవుతుందని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తల త్యాగాలు, నిరంతర పోరాటాల ఫలితంగానే కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన కేరళలోనూ, రాజకీయంగా క్లిష్టమైన బెంగాల్‌లోనూ పార్టీ బలంగా నిలబడిందని బండి సంజయ్ తెలిపారు. బెదిరింపులు, అణచివేతలు ఎదురైనా కార్యకర్తలు వెనకడుగు వేయలేదని అదే పోరాట పటిమ తెలంగాణలోనూ బీజేపీ విజయానికి బాట వేస్తుందని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.


