పదవీ విరమణ ప్రయోజనాలు ఉద్యోగుల హక్కు
టీ–పీ–టీ–ఎఫ్ జిల్లా అధ్యక్షులు బాలష్టి రమేష్
కాకతీయ, నెల్లికుదురు : పదవీ విరమణ ప్రయోజనాలు ప్రభుత్వ బిక్ష కాదని, అవి ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కులని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బాలష్టి రమేష్ స్పష్టం చేశారు. టీపీటీఎఫ్ నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో ఆలేరులో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి యాకయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాలష్టి రమేష్ మాట్లాడుతూ, దాదాపు 32 నుంచి 35 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పదవీ విరమణ బకాయిలను ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారిందన్నారు. బకాయిలు అందక అనేక మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులు అనారోగ్యంతో, అవమానాలతో జీవించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8 వేల మందికి పైగా ఉద్యోగులు పదవీ విరమణ చేశారని, ఒక్కొక్కరికి రూ.35 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు మొత్తం రూ.5 వేల కోట్లకు పైగా పదవీ విరమణ ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇవి దయతో ఇవ్వాల్సినవి కాదని, ఉద్యోగుల జీతాల నుంచే రికవరీ చేసిన జీపీఎఫ్, జీఐఎస్, టీఎస్‌జీఎల్‌ఐ వంటి నిధులేనని పేర్కొన్నారు. గ్రాట్యూటీ తప్ప మిగతా మొత్తమంతా ఉద్యోగుల సొంత సొమ్మేనని స్పష్టం చేశారు. కోర్టుల ఆదేశాలు, ప్రభుత్వ హామీలు, కమిటీల ఏర్పాటు ఉన్నప్పటికీ అమలు జరగకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 39 మంది పదవీ విరమణ ఉద్యోగులు మరణించారని తెలిపారు. ఇక మౌనం పాటించేది లేదని, సంఘటితంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వంపై ప్రజాస్వామిక ఉద్యమం చేపట్టి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. పదవీ విరమణ శిక్ష కాదని, అది ఉద్యోగులు–ఉపాధ్యాయుల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సంగా శ్రీనివాస్, బయ్యారం మండల జిల్లా కౌన్సిలర్ గోవర్ధన్, ఇనుగుర్తి మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, నెల్లికుదురు మండల కమిటీ సభ్యులు మధుసూదన్, సలీం, నవీన్, హరీష్, బిక్షపతి, రాజు, పద్మావతి, శ్రీనివాస్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


