అనుమతులు ఒకలా.. నిర్వహణ మరోలా..!
వెంకటేశ్వర వైన్స్‌లో నిబంధనలకు తూట్లు
బహిరంగంగానే ఉల్లంఘనలు – కానరాని తనిఖీలు
కాకతీయ, కరీంనగర్ :కరీంనగర్ నగరంలో వైన్స్ నిర్వాహకులు నిబంధనలను బేఖాతరు చేస్తూ లాభాలే లక్ష్యంగా ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చట్టబద్ధంగా తీసుకున్న అనుమతులు ఒకలా ఉండగా, క్షేత్రస్థాయిలో నిర్వహణ మాత్రం పూర్తిగా విరుద్ధంగా కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పర్మిట్ రూంల నిర్వహణకు స్పష్టమైన నియమాలు ఉన్నప్పటికీ, వాటిని పక్కనపెట్టి అనధికార సిట్టింగ్లు, టేబుళ్లు ఏర్పాటు చేసి మద్యం సేవించేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆహార భద్రత, పరిశుభ్రత వంటి మౌలిక నిబంధనలను పూర్తిగా విస్మరిస్తూ ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అనుమతుల పరిధిని దాటి షెడ్లు, విస్తరణలతో వ్యాపారం నడపడం చట్టాలకే సవాల్‌గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఉల్లంఘనలు బహిరంగంగానే జరుగుతున్నా సంబంధిత శాఖల పర్యవేక్షణ కనిపించకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది.

వెంకటేశ్వర వైన్స్‌లో ఇష్టారాజ్యం
నగరంలోని అంబేద్కర్ స్టేడియం సమీపంలో ఉన్న వెంకటేశ్వర వైన్స్‌లో నిబంధనలను పక్కనపెట్టి మద్యం వ్యాపారం సాగుతోందన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. పర్మిట్ రూంకే అనుమతి ఉన్నప్పటికీ, అనధికారంగా సిట్టింగ్లు ఏర్పాటు చేసి మద్యం సేవించేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలుస్తోంది. పర్మిట్ రూంలో ఆహార భద్రత, పరిశుభ్రతకు సంబంధించిన నిబంధనలు ఎక్కడా అమలవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా వైన్స్ పై అంతస్తులో నిబంధనలను విస్మరిస్తూ షెడ్ ఏర్పాటు చేసి సుమారు 20 టేబుళ్లతో వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతంలోనే ఈ ఉల్లంఘనలు కొనసాగుతున్నా తనిఖీలు లేకపోవడంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
మామూళ్ల మాటున తనిఖీలు మాయం
బహిరంగంగానే అనధికార షెడ్డులు, నిబంధనలకు విరుద్ధమైన పర్మిట్ రూంల నిర్వహణ జరుగుతున్నా సంబంధిత అధికారుల తనిఖీలు కనిపించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ అక్రమాల వెనుక నెలవారీ మామూళ్లే కారణమన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. మామూళ్లు అందితే నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.


