మతిభ్రమించి మాట్లాడుతున్న పుట్ట మధు
కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం
కాకతీయ, మంథని : మంథని ఎమ్మెల్యే, ఐటీ–పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కుటుంబ సభ్యులపై పుట్ట మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. రాజకీయాల్లో స్థాయి, సంస్కారం లేకుండా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంటూ మంథని, రామగిరి, కమాన్‌పూర్, ముత్తారం మండలాల కాంగ్రెస్ నాయకులు డా. బి.ఆర్. అంబేద్కర్ చౌరస్తాలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, పుట్ట మధుకు రాజకీయ గుర్తింపు తీసుకొచ్చింది దుద్దిళ్ల కుటుంబమేనని గుర్తుచేశారు. స్వర్గీయ శ్రీపాద రావు ఆశ్రయంతోనే అతడు రాజకీయాల్లోకి వచ్చి ఎంపీటీసీ, జెడ్పిటీసీ వంటి పదవులు పొందాడని తెలిపారు. అలాంటి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని స్థాయి మరిచి మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. బహుజనవాదం పేరుతో మాట్లాడుతున్న పుట్ట మధు ఇప్పటివరకు ఎంతమందిని నాయకులుగా తీర్చిదిద్దాడో అంబేద్కర్ సాక్షిగా చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యక్తిగత కుటుంబాలను రాజకీయాల్లోకి లాగలేదని, విమర్శలు వ్యక్తుల పనితీరుపై మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. శ్రీధర్ బాబు తెస్తున్న నిధులు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే పుట్ట మధు అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారు. నలభై ఏళ్లుగా ప్రజలు ఎందుకు అదే కుటుంబాన్ని గెలిపిస్తున్నారో పుట్ట మధు ఆలోచించాలని సూచించారు. అదేవిధంగా పుట్ట మధు ఆస్తులపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏమీ లేని స్థితి నుంచి వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో, వెంకటాపూర్లో ఉన్న వందల ఎకరాలు, ఫ్లాట్లు, కార్లు, విలాసవంతమైన భవనాల మూలం ఏమిటో వెల్లడించాలని అన్నారు. ఇకపై శ్రీధర్ బాబు కుటుంబంపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు, మంథని ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రాజకీయాల్లో సంస్కారం, గౌరవం పాటించాలని పుట్ట మధుకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


