ఎమ్మార్వో కార్యాలయ తరలింపుపై ఆందోళన
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఖిలావరంగల్ మండలంలోని ఎమ్మార్వో కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న స్థలం నుంచి మరోచోటికి తరలించేందుకు అధికారులు యత్నిస్తున్నారన్న సమాచారంపై స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరలింపుకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా ఖిలావరంగల్ కార్పొరేటర్ బైరబోయిన ఉమా యాదవ్ నిలిచారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉమా యాదవ్ మాట్లాడుతూ, మ్యూజియం పక్కన ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లో ఎమ్మార్వో కార్యాలయం కోసం ఆరు గదులు గత ఎనిమిది సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే ఈ భవనాన్ని వినియోగించకుండా కార్యాలయాన్ని మరోచోటికి తరలించాలనుకోవడం అర్థరహితమని విమర్శించారు. పేరుకే ఖిలావరంగల్ మండలం ఉన్నా, మూడు కోటల చారిత్రక పట్టణంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా సక్రమంగా లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఖిలావరంగల్ నుంచి ఎమ్మార్వో కార్యాలయాన్ని తరలిస్తే తీవ్ర నిరసనలు, మరో తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని, ఎమ్మార్వో కార్యాలయాన్ని మ్యూజియం పక్కన ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఉమా యాదవ్ స్పష్టం చేశారు.


