‘పొలం బాట’ పేరుతో వసూళ్ల బాట..
మంగపేటలో విద్యుత్ అధికారి ప్రశాంతంగా వసూల్
ట్రాన్స్‌ఫార్మర్ పెట్టాలంటే డబ్బులివ్వాల్సిందేనంట
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలం పరిధిలో వ్యవసాయ విద్యుత్ సదుపాయాల పేరుతో అక్రమ వసూళ్లు జోరు పెంచిన కిందిస్థాయి విద్యుత్ శాఖ అధికారి రైతులపై ఆంక్షల కుటీల వల నూను గట్టిగా బిగిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల కోసం అమలవుతున్న ‘పొలం బాట’ కార్యక్రమాన్ని తన స్వార్ధ ప్రయోజనాల కోసం ‘వసూళ్ల బాట’గా మలచుకున్నాడనే ఆరోపణలు మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మంగపేట మండలంలోని ఒక రైతు నుండి కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు, పాత యంత్రాల మార్పిడి, లైన్ల మరమ్మతుల వంటి పనుల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు విషయంలో సరాసరి ₹1.50 లక్షలు వరకు వసూలు చేశాడనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. సాధారణంగా నామమాత్రపు ఖర్చుతో, ప్రభుత్వ విధానాల ప్రకారం రైతులకు అందాల్సిన సదుపాయాలకే భారీ లావాదేవీలు జరిపించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరూ ఏమీ చేయలేరని…
ఇప్పటికే ప్రమోషన్ జాబితాలో ఉన్న తమకై ఎవరూ ఏమీ చేయలేరని, సీఎండీ స్థాయి వరకు పరిచయాలు ఉన్నాయని సదరు ఉద్యోగి సమక్షంలోనే చెప్పుకుంటున్నాడని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే విద్యుత్ శాఖలో అవినీతి, అక్రమాలకు తావివ్వం, నిరూపితమైనా కఠిన చర్యలే అన్న సీఎండీ హెచ్చరికలున్నప్పటికీ ఈ ఉద్యోగిపై మాత్రం చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులకు ఉపశమనం కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పొలం బాట’ కార్యక్రమాన్ని వ్యక్తిగత లాభార్జన సాధనంగా మార్చుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం. మంగపేట రైతులపై జరిగిందని పేర్కొంటున్న ఈ వసూళ్ల వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి నిజనిజాలు వెలుగులోకి తేవాలని, అక్రమాలకు పాల్పడిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.రైతుల శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమంలోనే లంచాల నీడ పడుతుండటం బాధాకరం అని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఆరోపణలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలనే ధ్వని వినిపిస్తోంది.


