ముక్కోటి ఏకాదశి భక్తి పరిపూర్ణమైన పర్వదినం
మంత్రి కొండా సురేఖ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి కొండా సురేఖ వరంగల్ నగరం లోని వెంకటేశ్వర దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం రోజున ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలోని బట్టల బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. తెల్లవారుజామున నుంచే భక్తులు భారీ సంఖ్యలో స్వామి వారిని వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారం) గుండా దర్శించుకోవడానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తి మయంగా మారాయి.రాష్ట్ర దేవాదాయ, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఆలయానికి విచ్చేసి, ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ ప్రకారం కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకొని సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ముక్కోటి ఏకాదశి భక్తి పరిపూర్ణమైన పర్వదినం అని అన్నారు. ప్రతి ఒక్కరూ ధర్మం, సేవ, సద్భావం పట్ల నడుచుకోవాలని” భక్తులను కోరారు. వరంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని భక్తులకు భరోసా ఇచ్చారు. అలాగే ఈ పర్వదినం సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు వందలాది భక్తులకు ‘అన్నప్రసాద వితరణ’ కార్యక్రమం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం పోలీసు , దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛంద సేవా సభ్యులు భక్తులకు సహాయం అందించారు. ప్రాంతీయ ప్రజా ప్రతినిధులు, అధికారికులు, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


