విద్యార్థులకు బడి బ్యాగుల పంపిణీ..
కాకతీయ, హనుమకొండ : అయోధ్యపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామానికి చెందిన దాతలు బడి బ్యాగులను పంపిణీ చేశారు. మేరుగు రాజయ్య–రజిత దంపతుల కుమారుడు పవన్ కళ్యాణ్ చిన్న వయసులోనే, పన్నెండు సంవత్సరాల క్రితం అకాల మరణం చెందాడు. పవన్ కళ్యాణ్ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 30న రాజయ్య తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బడి బ్యాగులు అందజేయడంతో పాటు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ విద్యార్థులతో మాట్లాడారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని ఉద్యోగంలో స్థిరపడ్డానని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. మేరుగు రాజయ్య కుటుంబం ఇచ్చిన స్ఫూర్తితో భవిష్యత్తులో అయోధ్యపురం విద్యార్థులకు తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల చురుకుదనం చూసి ఆనందం వ్యక్తం చేసిన రాఘవేందర్ ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మేరుగు అరుణ్ ప్రసాద్, రాజయ్య కూతురు నన్నెబోయిన పావని, అల్లుడు కృష్ణ, ఇలాసాగరం శ్రీనివాస్, సమద్ పాషా పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్నె చంద్రయ్య దాతల కుటుంబానికి, వారి బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు


