చామనపల్లిలో పులి సంచారంపై కేంద్ర మంత్రి ఆరా
కరీంనగర్ డీఎఫ్ఓ కు ఫోన్
పులి సంచారం నిజమేనని చెప్పిన డీఎఫ్ఓ
ప్రజలు ధైర్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరిన బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి సహా పలు గ్రామాల్లో పులి సంచారం కలకలం రేపుతున్న నేపథ్యంలో కేంద్ర శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. ఈ విషయమై కరీంనగర్ జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా తక్షణమే అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేలా సూచనలు ఇవ్వాలని, రైతులు ధైర్యంగా ఉండేలా అవగాహన కల్పించాలని కోరారు.
అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా పులి కాలి ముద్రలు ఉన్నట్లు ధ్రువీకరించారు. ఈ వివరాలను డీఎఫ్ఓ కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతం నుంచి పులి ఈ ప్రాంతానికి వచ్చినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అది మగ పులి అయి ఉండొచ్చని పేర్కొన్నారు.కరీంనగర్ జిల్లాలో విస్తృత అటవీ ప్రాంతం లేకపోవడంతో పులి పెద్దపల్లి జిల్లా వైపు వెళ్లి ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. పులి సంచారం విషయమై స్థానికులు, రైతుల్లో కొందరు మంత్రికి సమాచారం అందించడంతో ఆయన ముందుగా పలువురితో ఫోన్‌లో మాట్లాడి, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అటవీ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.


