ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి సందడి
కాకతీయ, గీసుగొండ : ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించు కొని గీసుగొండ మండలంలోని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని కొమ్మాల గ్రామంలో కొలువు దీరిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి రామా చార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసచార్యులు, ఆలయ అర్చకులు విష్ణు చార్యులు, ఫణీంద్ర చార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని స్వయంభూ శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మామునూరు ఏసిపి వెంకటేశ్వర్,గీసుగొండ సిఐ విశ్వేశ్వర్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.


