వ్యవసాయ బావి వద్ద రైతు ఆత్మహత్య
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టు దుద్దెనపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు గొర్రెంకల చిన్న ఎల్లయ్య (55) తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమవారం సాయంత్రం పొలం పనులకు వెళ్లిన ఎల్లయ్య రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం ఆయన కోసం వెతకగా, వ్యవసాయ బావి సమీపంలోని చెట్టుకు వేలాడుతూ మృతదేహం కనిపించింది.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.


