శంకుస్థాపనలకే పరిమితమైన వెంకన్న గుడి..!
పద్మనగర్‌లో అటకెక్కిన టిటిడి దేవాలయ హామీ
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని పద్మనగర్‌లో టిటిడి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిస్తామని ఘనంగా ప్రకటించి, శంకుస్థాపనలు చేసిన అధికారులు,ప్రజాప్రతినిధులు చివరికి స్వామివారిని గాలికి వదిలేశారని కరీంనగర్ భారతీయుడు కోట శ్యామ్‌కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలకు భక్తి పేరుతో ఆశలు చూపించి, కార్యక్రమాలు నిర్వహించి, శిలాఫలకాలు పెట్టి, అనంతరం ఆలయ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమన్నారు.అన్నా నాకు మోలతాడు ఉందంటారు మరి గుడి ఎక్కడ? ఉత్తర ద్వారం దర్శనం ఎక్కడ? అంటూ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు.
ఇన్నేళ్లుగా ఆలయ నిర్మాణంపై ఎలాంటి పురోగతి లేకపోవడం, కనీస సమాచారం కూడా ప్రజలకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. భక్తుల విశ్వాసాలతో చెలగాటమాడటం సరికాదని, వెంటనే ఆలయ నిర్మాణంపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పద్మనగర్ ప్రజల ఆకాంక్షగా ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణాన్ని పునఃప్రారంభించి, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.


