కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నిమిత్తం మోతీనగర్‌లో బీఆర్ఎస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మోతీ నగర్, రెహ్మత్ నగర్ డివిజన్ల పార్టీ ఇంచార్జ్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష.
హైదరాబాద్‌ను విశ్వనగరాల సరసన నిలబెట్టిన ఘనత కేటీఆర్ అని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ అకాల మరణం పార్టీకి తీరనిలోటని, ఆయన మరణంతో ఈ ఉప ఎన్నికలు తప్పనిసరయ్యాయని అన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్ల మద్దతు ఖచ్చితంగా బీఆర్ఎస్‌కే దక్కుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గులాబీ సైనికులు కష్టపడి కారు గుర్తుకు ఓటు వేయించేలా పనిచేయాలని, మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అమలు చేయని హామీలు, అసమర్థ పాలన గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్, కేటీఆర్ పాత్రను ప్రజలకు తెలియజేసి ఓట్లు అడగాలని, నగరంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖంగా జీవించాలంటే బీఆర్ఎస్ విజయం అవసరమని స్పష్టం చేశారు.


