రైతుల రహదారిపై తప్పుడు ఫిర్యాదు
కాంగ్రెస్ నేత కొలగని అనిల్ వెంటనే ఫిర్యాదు ఉపసంహరించుకోవాలి
డీఆర్వోకు వినతి మీడియాతో నగునూరు రైతుల ఆవేదన
కాకతీయ, కరీంనగర్ : నగునూరు గ్రామంలో రైతుల రవాణా, రాకపోకల సౌకర్యార్థం నిర్మించిన రహదారిపై కాంగ్రెస్ నేత కొలగని అనిల్ తప్పుడు ఫిర్యాదు చేసి దుష్ప్రచారం చేయడం సరికాదని నగునూరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికారులకు అసత్య సమాచారం ఇచ్చి రైతులను ఇబ్బంది పెట్టడం తగదని పేర్కొన్నారు.
ఈజీఎస్ ద్వారా రైతులకు ఉపయోగపడేలా రహదారి నిర్మాణం జరిగిందని, దీనికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కు స్థానిక రైతులు వినతి పత్రం సమర్పించడంతో పనులు పూర్తయ్యాయని రైతులు తెలిపారు. అయితే ఈ రహదారిపై మాజీ కార్పొరేటర్ కొలగని శ్రీనివాస్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేత కొలగని అనిల్ ప్రజావాణిలో తప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో మంగళవారం నగునూరు రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వాస్తవ పరిస్థితిని జిల్లా అధికారులకు వివరించారు. అనిల్ చేసిన తప్పుడు ఫిర్యాదును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా రెవెన్యూ అధికారికి లిఖితపూర్వక వినతి పత్రం సమర్పించారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడారు.రైతుల మేలు కోసం నిర్మించిన రహదారిని రాజకీయ కోణంలో చూడడం బాధాకరమని తెలిపారు. చుట్టుపక్కల రైతులందరికీ ఉపయోగపడే ఈ రహదారి విషయంలో వాస్తవాలను పక్కనపెట్టి, వ్యక్తిగత లక్ష్యంతో తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ నేత కొలగని అనిల్ తన తప్పుడు ఫిర్యాదును వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు స్పష్టంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతులు పెంచాలా సీతారామరాజు, శ్రీనివాసరావు, పురుషోత్తం మల్లేశం, వేల్పుల శ్రీనివాస్, దాసరి భూపతి, మూల కృష్ణారెడ్డి, యాస్వాడ జగదీష్, ఆరెల్లి శ్రీనివాస్ గౌడ్, తిరుపతి గౌడ్, పూదారి రమేష్, మురహరిరావు, అలుస సత్యం, రవి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


