వైభవంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం
కాకతీయ, గణపురం : గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం భక్తిరసభరితంగా, వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో అత్యంత పుణ్యకరమైన ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ పరిసరాలు పండుగ వాతావరణంలో మునిగిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు ముసునూరి నరేష్ స్వామివారికి తులసీమాలలు, పుష్పమాలెలతో ప్రత్యేక అలంకారం చేసి పూజలను ఘనంగా నిర్వహించారు. ఉత్తర ద్వారంగా స్వామివారు వైకుంఠ ప్రవేశ దర్శనం ఇవ్వగా, ఉదయం నుంచే భక్తులు స్వామివారి దివ్య దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. “ఓం శ్రీ రామాయ నమః” నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. మహిళలు, వృద్ధులు, యువకులు, చిన్నారులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. స్వామివారి సేవలో పాలుపంచుకోవడం తమకు ఆధ్యాత్మిక ప్రశాంతిని కలిగించిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.


