క్రికెట్ ఆడొద్దన్నందుకు ఆత్మహత్య
తల్లి మందలింపును తీవ్రంగా తీసుకున్న బాలుడు
మంచిర్యాల జిల్లా దండేపల్లిలో విషాదం
కాకతీయ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దండేపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న న్యాలం ఆకర్ష్ (14) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్రికెట్ ఆడేందుకు వెళ్లొద్దని, హోంవర్క్ పూర్తిచేయాలని తల్లి శ్రీదేవి బాలుడిని మందలించారు. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న ఆకర్ష్ క్షణికావేశానికి లోనయ్యాడు. ఇంట్లోని బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకున్నాడు. ఎంతోసేపటికీ తలుపులు తెరవకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో తలుపులు పగలగొట్టి చూడగా బాలుడు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడి మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


