బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య
నాచారంలో ముగ్గురు యువకుల ఘాతుకం
పోలీసుల అదుపులో నిందితులు
కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్ నాచారంలో వృద్ధురాలి హత్య నగరంలో కలకలం రేపింది. బంగారం, నగదు కోసం ముగ్గురు యువకులు కలిసి సుజాత అనే వృద్ధురాలిని ఆమె స్వగృహంలోనే దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన నిందితుల్లో ఒకరు గతంలో అదే ఇంట్లో అద్దెకు నివసించిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో బంగారం, నగదు ఉన్న ప్రదేశాలపై పూర్తి అవగాహన ఉండటంతో దోపిడీకి పక్కా ప్లాన్‌తో వచ్చారు. అవకాశం దొరికిన వేళ వృద్ధురాలిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు.
క్లూస్ టీమ్ రంగంలోకి
సమాచారం అందుకున్న నాచారం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ హత్య ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు దారితీసింది. నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.


