శ్రీరంగనాథుడిగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం
గర్భగుడిలో శేషపాన్పుపై పడుకున్న విష్ణుమూర్తి ప్రతిమ
కాకతీయ,గీసుగొండ : ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని గీసుగొండ మండలంలోని ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరిన శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శ్రీరంగనాథుడిగా ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ గర్భగుడిలో శేషపాన్పుపై శయనించిన విష్ణుమూర్తి ప్రతిమను ప్రతిష్ఠించి ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు వైదిక మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యఫలం కలుగుతుందన్న విశ్వాసంతో భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశి వేడుకలతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో పులకరించిపోయింది.ఈ కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు శ్రీహర్ష,ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, కోశాధికారి కొత్తగట్టు రాజేందర్, కమిటీ సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.


