నాలుగోసారి ఫిర్యాదు… ఎట్టకేలకు కదిలిన బల్దియా!
అక్రమ నిర్మాణంపై మళ్లీ ఫిర్యాదు.. గ్రీవెన్స్‌లో వాగ్వాదం
బల్దియా కమిషనర్ జోక్యంతో సద్దుమణిగిన వివాదం
చివరకు నోటీసులకు ఆదేశం
కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డు లేకుండా పోతోందన్న ఆరోపణలు మరోసారి బల్దియా గ్రీవెన్స్ వేదికగా వినిపించాయి. రోడ్లు, నాలాలు, చెరువు శిఖం వంటి ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్లో హనుమకొండకు చెందిన ఓ వ్యక్తి నాలుగోసారి ఫిర్యాదు చేయడంతో హల్చల్ చోటుచేసుకుంది. తన ఫిర్యాదులపై స్పందించకపోవడాన్ని ప్రశ్నిస్తూ అధికారులతో ఫిర్యాదుదారుడికి వాగ్వాదం జరిగింది. అడిషనల్ కమిషనర్ జోక్యంతో వివాదం కొంత సద్దుమణిగింది. ఈలోగా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ వేదికపైకి రావడంతో ఫిర్యాదుదారుడు తన గోడును నేరుగా వినిపించాడు.
ఇప్పటికే మూడు సార్లు ఫిర్యాదు
హనుమకొండ హంటర్ రోడ్ ఏరియాలో ఇంటి నంబర్ 1-7-974 పక్కన సుధారాణి అనే మహిళ అక్రమంగా నిర్మాణం చేపడుతున్నట్లు స్థానికుడు జూలపల్లి సంపత్ రావు ఆరోపించాడు. ఈ మేరకు జూలై 7, జూలై 14, డిసెంబరు 15, 2025 తేదీల్లో మూడు సార్లు గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు. ఒకసారి అవినాశ్ అనే అధికారి ఫోన్ చేసి వివరాలు అడిగినప్పటికీ, ఆ తర్వాత స్పందన లేకపోవడంపై అధికారులను నిలదీశాడు. తాజాగా రోడ్డును ఆక్రమిస్తూ మరో నిర్మాణం కూడా చేపడుతున్నారని పేర్కొన్నాడు.
కమిషనర్ ఆదేశాలతో కదలిక
ఫిర్యాదును విన్న కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ వెంటనే సంబంధిత అక్రమ నిర్మాణంపై నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అప్పటివరకు కొనసాగిన వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా సంపత్ రావు మొత్తం ఇంగ్లిష్‌లో మాట్లాడటంతో కొంతసేపు గ్రీవెన్స్ సెల్లో గందరగోళం నెలకొంది. అధికారులు కూడా మౌనంగా ఉండి ఆయన సమస్యను వినేందుకు ప్రయత్నించారు. ఇంగ్లిష్‌లో మాట్లాడే వారికే అధికారులు భయపడతారా? వారి ఫిర్యాదులకే స్పందిస్తారా? అంటూ ఇతర ఫిర్యాదుదారులు అసహనం వ్యక్తం చేశారు. తామూ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను అదే వారం పరిష్కరించాలని కమిషనర్ తొలి రోజే ఆదేశించినా, జూలై నుంచి మూడుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని చర్చ సాగుతోంది. మరి సంపత్ రావు ఫిర్యాదుపై బల్దియా వాస్తవంగా చర్యలు తీసుకుంటుందా? లేక బుట్టదాఖలేనా? అన్నది వేచిచూడాల్సిందే.


