మాకులలో ఘనంగా స్నాపన తిరుమంజనం!
స్వయంభూ వెంకటేశ్వర ఆలయంలో వేడుక
ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకం
వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలు
భక్తులతో కళకళలాడిన ఆలయం
కాకతీయ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సుప్రసిద్ధ మాకుల స్వయంభూ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో సోమవారం స్నాపన తిరుమంజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక అర్చకులు నల్లాన్ చక్రవర్తుల లక్ష్మణ చార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు వేదమంత్రోచ్ఛారణల మధ్య పంచామృత అభిషేకం, చక్ర స్నానం, స్నాపన తిరుమంజన కార్యక్రమాలు నేత్రపర్వంగా నిర్వహించారు.
వేదమంత్రాల నడుమ అభిషేకాలు
స్నాపన తిరుమంజనంలో భాగంగా స్వామివారికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో మార్మోగింది. ఉత్సవ మూర్తుల దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా గోదాదేవి పాశురాలను ఉదహరిస్తూ, కలియుగంలో హరినామ సంకీర్తన ద్వారా భగవంతుని సులభంగా పొందవచ్చని అర్చకులు భక్తులకు అనుగ్రహ భూషణం చేశారు. అనంతరం సామూహికంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీమన్న నారాయణ చార్యులు, ఉల్లి శ్రీనివాస్, పువ్వాడ నర్సయ్య దంపతులు సహా పలువురు భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.


