కాకతీయ, ములుగు : ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి, ఐపీఎస్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజలు వరద ముప్పు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని ఎస్పీ హెచ్చరించారు.
వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్టులు, రహదారులపై దాటవద్దని, శిధిలమైన ఇండ్లలో నివసించవద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు తాకరాదని ఆయన తెలిపారు. అలాగే గ్రామాలలో చేపల వేటకు వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, వరద ప్రవాహాల వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని వాగులు, చెరువులు, కుంటల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఎస్పీ తెలిపారు.
ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందని, ఈ క్రమంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు (ఎస్ డి ఆర్ ఎఫ్ ), జిల్లా విపత్తు ప్రతిస్పందన దళాలు (డి డి ఆర్ ఎఫ్ ) బృందాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు పోలీస్ శాఖ సహాయం పొందేందుకు డయల్ 100 సేవను వినియోగించుకోవాలని ఎస్పీ శబరీష్ సూచించారు.


