చెకుముకిలో అల్ఫోర్స్ జయభేరి!
కాకతీయ, కరీంనగర్ : అల్ఫోర్స్ ఇ–టెక్నో స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి చెకుముకి పోటీల్లో ప్రథమ స్థానం సాధించి కరీంనగర్ జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి రాష్ట్రస్థాయి పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అసమాన ప్రతిభ కనబరిచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో స్కూల్‌లో అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శాస్త్రీయ ఆలోచనలతో ముందుకు
డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు సరైన ప్రోత్సాహం, అవసరమైన వనరులు అందిస్తే అద్భుత ఫలితాలు సాధించగలరన్నారు. పోటీ ప్రపంచంలో వినూత్న ఆలోచనలతో నమూనాలు రూపొందించి శాస్త్ర రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించాలని సూచించారు. సీవీ రామన్, జె.సి. బోస్, హరి గోవింద్ ఖురానా వంటి భారత శాస్త్రవేత్తల జీవితాల నుంచి స్ఫూర్తి పొంది ప్రాజెక్టులు రూపొందించాలని తెలిపారు. పాఠశాలలో నిపుణులైన శాస్త్ర ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇస్తూ వివిధ స్థాయిల పోటీలకు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి చెకుముకి పోటీల్లో అల్ఫోర్స్ పాఠశాలకు చెందిన కే. ఓం కార్తికేయ (10వ తరగతి), ఎస్. రీషాల్ (9వ తరగతి), ఓ. శివ స్మరణ్ రెడ్డి (8వ తరగతి) ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు. విజేతలకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలుపుతూ, జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, శాస్త్ర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


