రాజన్నను దర్శించుకున్న ఆస్ట్రేలియా లిబరల్ పార్టీ ఎంపీ అభ్యర్థి
కాకతీయ, వేములవాడ : ఆస్ట్రేలియా సౌత్ ఆస్ట్రేలియాలో లిబరల్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న యారాల హరిత కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన యారాల ఆదిరెడ్డి సతీమణి అయిన హరిత ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి యారాల హరిత కుటుంబాన్ని ఆశీర్వదించారు.
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న హరిత
వేములవాడ ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో యారాల హరిత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. స్వామివారి దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందం కలిగిందని తెలిపారు. రాబోయే మార్చి నెలలో జరగనున్న ఆస్ట్రేలియా పార్లమెంట్ ఎన్నికల్లో విజయాన్ని ప్రసాదించాలని ఇలవేల్పు రాజన్నను వేడుకున్నట్లు యారాల హరిత పేర్కొన్నారు. రాజన్న ఆశీస్సులతో ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆలయ దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆమెకు స్వామివారి ప్రసాదాలు అందజేశారు.


