జనవరి 3న కొండగట్టుకు పవన్ కళ్యాణ్
టీటీడీ నిధులు రూ.35.19 కోట్లతో అభివృద్ధి పనులు
దీక్షా విరమణ మండపం, భారీ సత్రాల నిర్మాణాలకు భూమిపూజ
ఏపీ డిప్యూటీ సీఎంకు అంజన్నతో ప్రత్యేక అనుబంధం
పవన్ పర్యటనకు రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం
అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టును సందర్శించనున్నారు. జనవరి మూడో తేదీన డిప్యూటీ సీఎం కొండగట్టుకు రానున్నారు. ఈసందర్భంగా ఆయన ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈమేరకు పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మార్గశిర పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో చేయనున్న ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. టీటీడీ నిధులతో సుమారు రూ.35 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. 100 గదుల అత్యాధునిక ధర్మశాలకు భూమిపూజ చేయనున్నారు. ఒకేసారి 2,000 మంది భక్తులు హనుమాన్ దీక్షను విరమించేలా భారీ మండపాన్ని నిర్మించనున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక వసతి గృహాల నిర్మాణం చేపడుతున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఆలయ మౌలిక వసతులు, భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరచే దిశగా ఉండనున్నాయి.
ప్రత్యేక అనుబంధం
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ ఇదే ఆలయం నుంచి ప్రకటన చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయానికి వస్తుండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొండగట్టుకు వచ్చి అంజన్న స్వామిని దర్శించుకోవడం పవన్ కల్యాణ్ విశేషంగా భావిస్తున్నారు. ఈ పర్యటన రాజకీయంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్ కల్యాణ్ రాకతో కొండగట్టు ప్రాంతంలో భక్తులు, ఆయన అభిమానుల భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


