జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, నిర్మాణాల అనుమతుల ప్రక్రియపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
తనిఖీల్లో భాగంగా అధికారులు కీలక ఫైళ్లు, రికార్డులు, పలు బిల్లుల దస్త్రాలను స్వాధీనం చేసుకుని సంబంధిత అధికారులను విచారిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి పనుల బిల్లులు, అనుమతులకు సంబంధించిన పత్రాలపై సవివరంగా పరిశీలన కొనసాగుతోంది.ఏసీబీ తనిఖీల కారణంగా మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో మీడియాకు కార్యాలయంలోకి అనుమతి ఇవ్వకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.


