మాజీ సర్పంచులకు వేధింపులు
బిల్లులు చెల్లించకుండా ముందస్తు అరెస్టులు
కాకతీయ, హుజురాబాద్: మండలంలో కొత్త సర్పంచులు ఎన్నికై పాలన సాగుతున్నా, గ్రామాభివృద్ధి కోసం ఖర్చుపెట్టిన మాజీ సర్పంచుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో పాటు, నిరసనలకు పిలుపునిస్తే ముందస్తు అరెస్టుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని మాజీ సర్పంచులు ఆరోపిస్తున్నారు. మాజీ సర్పంచుల బిల్లుల చెల్లింపునకు డిమాండ్ చేస్తూ, తాజా మాజీ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మండలంలోని పలువురు మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రంగాపూర్ మాజీ సర్పంచ్ బింగి కరుణాకర్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి కోసం తమ సొంత డబ్బులతో పనులు చేపట్టామని తెలిపారు.మాకు రావాల్సిన బిల్లులు ఇప్పటికీ విడుదల కాలేదు. భార్యా పిల్లల బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి గ్రామాలు అభివృద్ధి చేశాం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బిల్లులు చెల్లిస్తామని హామీలు ఇచ్చినా, ఇప్పటివరకు అమలు కాలేదు అని అన్నారు.ప్రతి నెల ముందస్తు అరెస్టుల పేరుతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాజీ సర్పంచులకు రావాల్సిన బిల్లులు వెంటనే చెల్లించి, వేధింపులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనలో తుమ్మనపల్లి మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డి, రాంపూర్ మాజీ సర్పంచ్ మనోహర్, వెంకట్రావుపల్లి మాజీ సర్పంచ్ కన్నబోయిన తిరుపతి తదితరులు ముందస్తు అరెస్టుకు గురయ్యారు.


