వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన రామాలయం
గణపురం ఆలయంలో గణపురంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు
కాకతీయ, గణపురం : గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావచ్చన్న అంచనాతో ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి అలంకరణలు చేపట్టారు.
ఉత్తర ద్వార దర్శనం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి సర్వదేవతామూర్తులతో కలిసి ఉత్తర ద్వారమార్గంగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ ప్రత్యేక దర్శనం ద్వారా భక్తులు పుణ్యఫలాలు పొందుతారని అర్చకులు పేర్కొన్నారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి దైవ అనుగ్రహాన్ని పొందాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ తెలిపారు. శాంతియుతంగా దర్శనం పూర్తిచేసుకునేందుకు భక్తులు ఆలయ సిబ్బందికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్, మూల శ్రీనివాస్ గౌడ్, బటిక స్వామి, బూర రాజగోపాల్, మాదాసు అర్జున్, దయ్యాల భద్రయ్య, ఉయ్యాల బిక్షపతి, మాదాసు మొగిలి, పాండవుల భద్రయ్య, మోటపోతుల రాజన్న గౌడ్‌తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.


