ఓపెన్ జిమ్‌లపై నిర్లక్ష్యమే!
నిర్వహణపై స్పష్టత లేదంటూ ఆరోపణలు
ప్రజావాణిలో కమిషనర్‌కు వినతి
కోట్ల ఖర్చు… పరికరాలు పనికిరాని స్థితి
ప్రజల ఆరోగ్యంపై ప్రభావం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లను తక్షణమే మరమ్మతు చేసి, సక్రమంగా నిర్వహించాలని కాంగ్రెస్ నాయకుడు అనంతుల రమేష్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ల నిర్వహణ బాధ్యత ఎవరిదో స్పష్టత లేకుండా పోయిందన్నారు. కాంట్రాక్టర్ బాధ్యతా? లేక మున్సిపాలిటీదా? అనే విషయాన్ని అధికారులు తేల్చాలని డిమాండ్ చేశారు.
కోట్ల ఖర్చు… నిర్లక్ష్య నిర్వహణ
నగరంలో సుమారు రూ.3.60 కోట్ల వ్యయంతో 30 ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసి, ఒక్కో జిమ్‌కు దాదాపు రూ.12 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. అయితే నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పరికరాలు చెడిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చలికాలం నేపథ్యంలో ఓపెన్ జిమ్‌లకు ప్రజల రద్దీ పెరిగిందని, రోజురోజుకు వ్యాయామం చేసే వారి సంఖ్య ఎక్కువవుతున్నప్పటికీ చాలా చోట్ల పరికరాలు పనికిరాని స్థితిలో ఉన్నాయని తెలిపారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. గత పాలక వర్గం నగర ప్రజల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసిందా? లేక కమిషన్ల కోసమా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టి, నిరంతర నిర్వహణకు చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థను ఆయన డిమాండ్ చేశారు.


