ప్రజా విశ్వాసం కోల్పోయిన ఎర్రబెల్లి
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్
కాకతీయ, తొర్రూరు : పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజా విశ్వాసం కోల్పోయిన ఎర్రబెల్లి దయాకర్‌రావు గెలవలేకనే అసమ్మతి నాయకులతో కుమ్మక్కై కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలవడం జీర్ణించుకోలేకే ఎర్రబెల్లి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
కొంతమంది కాంగ్రెస్ అసమ్మతి నాయకులను డబ్బులతో ప్రలోభపెట్టి పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నం చేసినా, కాంగ్రెస్ క్యాడర్ చెక్కుచెదరకుండా నిలిచిందన్నారు. మొత్తం 2.58 లక్షల ఓట్లు పోలవగా, కాంగ్రెస్‌కు 56.8 శాతం మద్దతు లభించిందని, బీఆర్ఎస్‌కు కేవలం 35.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని వివరించారు.
గ్రామాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడంతోనే కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల మద్దతు దక్కిందని, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని నాయకులు స్పష్టం చేశారు.


