మాజీ ఎమ్మెల్సీకి సీఐ సెల్యూట్!
వరంగల్ పోలీస్ వర్గాల్లో కలకలం
సోషల్ మీడియాలో వైరల్ వీడియో
సర్వీస్ రూల్స్ ఉల్లంఘనపై విమర్శలు
ఉన్నతాధికారుల స్పందనపై ఆసక్తి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగరంలో ఓ సీఐ చేసిన గౌరవ వందనం పోలీస్ శాఖలోనే కాకుండా రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి యూనిఫాంలో ఉన్న సీఐ రమేష్ సెల్యూట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది. అధికారిక పదవిలో లేని వ్యక్తికి సెల్యూట్ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
నిబంధనలకు విరుద్ధమా?
పోలీస్ యూనిఫాంలో ఉన్న అధికారి రాజకీయ నాయకుడికి వ్యక్తిగతంగా గౌరవ వందనం చేయడం సరికాదని మాజీ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సెల్యూట్ అనేది కేవలం అధికారిక హోదా ఉన్న రాజ్యాంగ పదవులకు మాత్రమే పరిమితమై ఉండాలని, మాజీ హోదా ఆధారంగా ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటన వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో తప్పుడు సందేశం వెళ్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైరల్ వీడియోతో పెరిగిన దుమారం
వైరల్ అయిన ఫోటో, వీడియోల్లో మరో కీలక పోలీస్ స్టేషన్ అధికారి కూడా ఉన్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ ఘటనపై పోలీస్ శాఖలో అంతర్గతంగా కూడా చర్చ జరుగుతోందని సమాచారం. గతంలోనూ కొందరు అధికారులు రాజకీయ నేతలతో సన్నిహితంగా వ్యవహరించి బదిలీలు, సస్పెన్షన్లకు గురైన సందర్భాలను నిఘా వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రాజకీయ అండదండలతోనే కొందరు అధికారులు కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారన్న ఆరోపణలకు ఈ ఘటన బలం చేకూరుస్తోందని ప్రతిపక్ష వర్గాలు విమర్శిస్తున్నాయి. ప్రజాసేవకులు రాజకీయ నాయకుల ముందు తలవంచుతున్నారనే భావన ప్రజల్లో ఏర్పడుతోందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు? విచారణకు ఆదేశాలు ఇస్తారా? లేక మౌనంగా వదిలేస్తారా? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. కొంతమంది అధికారుల అతి ఉత్సాహం వల్ల మొత్తం పోలీస్ శాఖకే మచ్చ పడుతోందని మాజీ అధికారులు, సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


