భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపింది. మల్లంపల్లి మండలం భూపాల్ నగర్ (పందికుంట) గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరిగిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. గ్రామస్థులు పులి పాదముద్రలను గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే ములుగు ఫారెస్ట్ అధికారి డోలి శంకర్, అటవీ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

భూపాల్ నగర్ స్మశాన వాటిక వద్ద నుంచి మల్లంపల్లి వైపుకు పులి కదలికలున్నట్టు అడుగుజాడల ఆధారంగా నిర్ధారించారు. అదేవిధంగా స్మశాన వాటిక వద్ద ఉన్న సిమెంట్ పొల్ పెద్దపులి తొక్కడంతో విరిగిన ఆనవాళ్లను కూడా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పశువుల కాపర్లు మరియు పొలాల్లో పనిచేసే కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. అవసరమైన పహారా చర్యలు చేపట్టామని, పులి కదలికలను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.


