ఎరువుల యాప్‌పై డీలర్లకు అవగాహన
కాకతీయ, నెల్లికుదురు/ఇనుగుర్తి : నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల పరిధిలోని ఎరువుల షాపు డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులకు ఎరువుల బుకింగ్ యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నెల్లికుదురు రైతు వేదిక కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇనుగుర్తి మండల వ్యవసాయ అధికారి, నెల్లికుదురు మండల ఇంచార్జి వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు సోమవారం నుంచి మహబూబాబాద్ జిల్లాలో యూరియా అమ్మకాలు కేవలం యూరియా బుకింగ్ యాప్ ద్వారానే నిర్వహించనున్నట్లు తెలిపారు. డీలర్లు దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. యూరియా బుకింగ్ చేసుకున్న రైతులకే ఎరువులు సరఫరా చేయాలని, ఎటువంటి అదనపు లింకులు లేకుండా నిబంధనల ప్రకారం అమ్మకాలు జరగాలన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామాల్లోని యువత వాలంటీర్లుగా ముందుకు వచ్చి రైతులకు యూరియా బుకింగ్ ప్రక్రియలో సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ముజాహిద్, ప్రవీణ్‌తో పాటు రెండు మండలాలకు చెందిన ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.


