‘దృశ్యం 3’ నుంచి తప్పుకున్న అక్షయ్ ఖన్నా
నిర్మాతలకు భారీ ఆర్థిక నష్టం.. లీగల్ నోటీసులతో ముదిరిన వివాదం
కాకతీయ, సినిమా : బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దృశ్యం 3’ సినిమాకు సంబంధించిన వివాదం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైన నటుడు అక్షయ్ ఖన్నా అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో నిర్మాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందే కాంట్రాక్ట్ పై సైన్ చేసి, పారితోషికం కూడా తీసుకున్నప్పటికీ సినిమా నుంచి బయటకు రావడం వల్ల తమకు భారీ నష్టం వాటిల్లిందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘దృశ్యం 3’ నిర్మాతలు అక్షయ్ ఖన్నాకు లీగల్ నోటీసులు పంపించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల జరిగిన నష్టానికి బాధ్యత వహించాల్సిందేనని నోటీసుల్లో స్పష్టం చేసినట్లు సమాచారం. అవసరమైతే కోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని నిర్మాతలు తేల్చిచెప్పారు.
కొత్త ఎంపిక… షూటింగ్‌పై ప్రభావం
అక్షయ్ ఖన్నా తప్పుకోవడంతో సినిమా షెడ్యూల్ మొత్తం మారిపోయిందని నిర్మాతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రీ–ప్రొడక్షన్ దశలో ఉన్న ప్రాజెక్ట్‌కు ఈ పరిణామం తీవ్ర ఆటంకంగా మారిందని తెలిపారు. ఆయన స్థానంలో ఇప్పుడు నటుడు జైదీప్ అహ్లావత్‌ను ఎంపిక చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ వివాదంపై అక్షయ్ ఖన్నా నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. దీంతో ఈ వ్యవహారం న్యాయపరమైన దిశగా వెళ్తుందా? లేక పరస్పర రాజీతో ముగుస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.


