దేశ అభివృద్ధికి పునాది వేసిన పార్టీ కాంగ్రెస్’
హుజూరాబాద్‌లో 141వ ఆవిర్భావ వేడుకలు
జెండా ఆవిష్కరించిన వొడితల ప్రణవ్
పేదల అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కాకతీయ, హుజూరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం సాధించి, ఆర్థిక-సామాజిక సంస్కరణలకు పునాది వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ కూడా కాంగ్రెస్‌నేనని ఆయన పేర్కొన్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, అలాగే మండల పరిధిలోని శాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను వొడితల ప్రణవ్ ఆవిష్కరించారు.
కాంగ్రెస్ చారిత్రక పాత్ర
ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ… దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో చెరగని ముద్ర వేసిందన్నారు. స్వాతంత్ర్యానంతరం దేశ నిర్మాణానికి అవసరమైన విధానాలు, సంస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాంగ్రెస్ పార్టీనే పునాదిగా నిలిపిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను ‘తెలంగాణ రైజింగ్’గా దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ప్రణవ్ తెలిపారు. గత రెండేళ్లుగా పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.
సీఎంఆర్ఎఫ్‌తో పేదలకు భరోసా
అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని వొడితల ప్రణవ్ పేర్కొన్నారు. అదే రోజు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాలు, పట్టణ పరిధిలోని 73 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.25 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు వాటిని వెంటనే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుని చికిత్సకు ఉపయోగించుకోవాలని ప్రణవ్ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


