ఏటీఎంలలో రేకు అడ్డం పెట్టి దోచేస్తారు
ఏటీఎంలో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
వరంగల్ ట్రైసిటీలో 7 ఏటీఎంలలో రూ.12.10 లక్షల చోరీ
దేశవ్యాప్తంగా 40కి పైగా ఏటీఎం చోరీల రికార్డు
టెక్నాలజీతో ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఏటీఎం మిషన్లలో డబ్బులు బయటకు రాకుండా ఇనుప రేకును అమర్చి ఖాతాదారులను మోసం చేస్తూ చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన అంతర్‌రాష్ట్ర ముఠా గుట్టును వరంగల్ పోలీసులు ఛేదించారు. వరంగల్ సీసీఎస్, కాజీపేట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.5.10 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులు ఆరిఫ్ ఖాన్, సర్ఫరాజ్, ఎం. ఆష్ మహ్మద్, షాపుస్ ఖాన్, షారూఖాన్, అస్లాం ఖాన్, ఎం. షారుఖాస్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లా మాల్కిడా తాలూకాకు చెందినవారిగా వెల్లడించారు.
ఏటీఎం చోరీల వెనుక ముఠా ప్లాన్
డీసీపీ కవిత వెల్లడించిన వివరాల ప్రకారం… ఒకే ప్రాంతానికి చెందిన ఈ నిందితులు మద్యం సేవిస్తూ సన్నిహితంగా గడుపుతూ, ఖర్చులకు డబ్బు లేకపోవడంతో సులభంగా సంపాదించేందుకు నేర మార్గాన్ని ఎంచుకున్నారు. ఓ పరిచయస్తుడి ద్వారా ఎస్‌బీఐకి సంబంధించిన పెర్టో కంపెనీ పాత ఏటీఎం మిషన్ల లోపాలను తెలుసుకుని, వాటిని తెరవడానికి నకిలీ తాళం చెవులు తయారు చేసుకున్నారు. ముందుగా పెర్టో ఏటీఎంలను గుర్తించి, మిషన్‌లో డబ్బులు బయటకు వచ్చే మార్గంలో గమ్‌తో ఇనుప ప్లేట్ అమర్చేవారు. ఖాతాదారుడు నగదు డ్రా చేస్తే డబ్బు బయటకు రాకుండా మిషన్‌లోనే ఆగిపోయేది. నగదు రాకపోవడంతో ఖాతాదారుడు మిషన్ లోపంగా భావించి వెళ్లిపోతాడు. అనంతరం నిఘా పెట్టిన ముఠా సభ్యులు మళ్లీ ఏటీఎం తెరిచి లోపల నిలిచిపోయిన నగదును దోచుకునేవారు. ఖాతాదారుడికి మాత్రం నగదు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చేది.

దేశవ్యాప్తంగా 40కి పైగా చోరీలు
ఈ పద్ధతితో నిందితులు రాజస్థాన్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో 40కి పైగా ఏటీఎం చోరీలకు పాల్పడ్డారు. పాత మిషన్ల స్థానంలో కొత్త ఏటీఎంలు ఏర్పాటు కావడంతో కొన్ని రాష్ట్రాల్లో వీరి కార్యకలాపాలు తగ్గగా, ఇటీవల వరంగల్ ట్రైసిటీని లక్ష్యంగా చేసుకున్నారు. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు వరంగల్ ట్రైసిటీలోని 7 ఏటీఎంలలో చోరీలు చేసి రూ.12.10 లక్షల నగదు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుబేదారి పరిధిలో నాలుగు, కాజీపేట, హనుమకొండ, మిల్స్ కాలనీ పరిధిలో ఒక్కొక్క ఘటన నమోదైంది. ఈరోజు ఉదయం కాజీపేట చౌరస్తా సమీపంలోని పెర్టో ఏటీఎం వద్ద మరోసారి చోరీకి ప్రయత్నిస్తుండగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. పారిపోవడానికి యత్నించినా పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాలను అంగీకరించారు. కేసును ఛేదించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఏసీపీలు సదయ్య, ప్రశాంత్ రెడ్డి, సీసీఎస్ ఎస్‌ఐ శ్రీనివాస్ రాజు, కాజీపేట ఎస్‌ఐలు నవీన్ కుమార్, లవణ్ కుమార్‌తో పాటు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు.


