నల్లతామరపై సేంద్రియ దెబ్బ!
మిర్చి, పత్తి పంటలకు రక్షణ
‘థ్రిప్స్ క్లియర్’తో ఉధృతి తగ్గింపు
రైతులకు తగ్గిన ఖర్చులు
శాస్త్రవేత్తల క్షేత్ర పరిశీలన
కాకతీయ, ములుగు ప్రతినిధి : మిర్చి, పత్తి పంటల్లో రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న నల్లతామర, ఎర్రతామర పురుగుల నివారణకు సేంద్రియ మందు థ్రిప్స్ క్లియర్ ప్రభావవంతంగా పనిచేస్తోందని జిపి అవెన్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు డాక్టర్ గాజుల ప్రభాకర్, డాక్టర్ పాపతోటి నరేంద్ర కుమార్ తెలిపారు. ఈ మందు వినియోగంతో తామర పురుగుల ఉధృతి గణనీయంగా తగ్గుతోందని, పంటలు ఆరోగ్యకరంగా ఎదుగుతున్నాయని వారు వెల్లడించారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
శనివారం మంగపేట మండలంలోని కమలాపురం, తిమ్మంపేట, రాజుపేట, కత్తిగూడెం గ్రామాల్లోని మిరప పంట పొలాలను శాస్త్రవేత్తలు సందర్శించారు. అక్కడ థ్రిప్స్ క్లియర్ పిచికారీ చేసిన పొలాలను పరిశీలించి రైతుల అనుభవాలను తెలుసుకున్నారు. పంటపై ముడతలు లేకుండా మంచి ఎదుగుదల కనిపిస్తోందని రైతులు వివరించారు. కమలాపురం గ్రామానికి చెందిన చింతం గోపాలకృష్ణ, చింతం పున్నారావు, పచ్చా శేషగిరిరావు, తిమ్మంపేట రైతులు పోకల శ్రీకాంత్, పూజారి ఆదినారాయణలు మాట్లాడుతూ… థ్రిప్స్ క్లియర్ వాడకం ద్వారా నల్లతామర, ఎర్రతామర పురుగుల సమస్య దాదాపుగా అదుపులోకి వచ్చిందన్నారు. రసాయన మందుల అవసరం తగ్గడంతో ఖర్చులు తగ్గాయని, దిగుబడులు పెరిగాయని తెలిపారు.
సేంద్రియ సాగుకు తోడ్పాటు
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ… థ్రిప్స్ క్లియర్ పూర్తిగా సేంద్రియ మందు కావడంతో పర్యావరణానికి హాని లేకుండా పంటలను రక్షిస్తుందని తెలిపారు. దీర్ఘకాలికంగా రైతులకు లాభదాయకంగా ఉండటంతో పాటు, పంట నాణ్యతను కూడా పెంచుతుందని చెప్పారు. తామర పురుగుల నివారణకు రైతులు ఈ సేంద్రియ మందును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


