బుస కొడుతున్న భూకబ్జా ‘కోరులు’
ఏనుమాముల–గొర్రెకుంటలో అక్రమ ఆక్రమణలు
రాత్రికి రాత్రే ఇండ్ల కూల్చివేత..
దిక్కుతోచని స్థితిలో 84 కుటుంబాలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా ఏనుమాముల గ్రామ పరిధిలోని సర్వే నం.156/B/1, గొర్రెకుంట గ్రామ శివారులోని సర్వే నం.195లలో భూకబ్జాదారుల అకృత్యాలు వెలుగుచూశాయి. సుమారు 20 ఏళ్ల క్రితం మధ్యతరగతి కుటుంబాలు భవిష్యత్తు అవసరాల కోసం కొనుగోలు చేసిన ప్లాట్లను నకిలీ పత్రాలతో కబ్జా చేసిన ఘటన కలకలం రేపుతోంది. బాధితుల వివరాల ప్రకారం ఈ రెండు సర్వే నంబర్లలో మొత్తం 84 ప్లాట్లను కుటుంబాలు కొనుగోలు చేశాయి. కొందరు హౌస్ నంబర్లు 46-6-21/A/1, 46-6-217 తదితర ఇళ్లను నిర్మించుకుని నివసిస్తుండగా, మరికొందరు తమ పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం ప్లాట్లను ఖాళీగా ఉంచారు.

కోర్టు కేసు నడుస్తుండగానే దాడి
కొంతమంది భూకబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ భూములను తమ పేర్లకు బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నించడంతో యజమానులు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో ఉండగానే ఈ నెల శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పెద్ద సంఖ్యలో దుండగులు అక్కడికి చేరుకుని నివాసితులను బెదిరింపులకు గురిచేసి ఇళ్ల నుంచి బయటకు పంపినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అనంతరం బుల్డోజర్లు, యంత్రాలతో ఇళ్లను కూల్చివేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినా, “విషయం కోర్టులో ఉందని మరో కేసు నమోదు చేయలేము” అంటూ ఫిర్యాదు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. రాత్రి వేళ ఇళ్లలో ఉండేందుకు కూడా భయపడుతున్నామని వాపోతున్నారు. “మా వద్ద అసలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పాత పహాణీలు, పన్నుల రసీదులు అన్నీ ఉన్నాయి. కోర్టు కేసు నడుస్తుండగానే ఇళ్లను కూల్చడం ఎంతవరకు న్యాయం?” అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, రెవెన్యూ ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని సర్వే నిర్వహించి నిజానిజాలు తేల్చాలని, నకిలీ పత్రాలతో భూములు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని 84 కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.


