భూ వివాదం.. ఘర్షణకు దారి
ఒకే భూమిపై ఇరువర్గాల హక్కు వివాదం
నిర్మాణ పనుల వద్ద ఉద్రిక్తత
పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపు
కాకతీయ, గీసుగొండ : గీసుగొండ మండలంలో ఒకే భూమి తమదేనంటూ ఇరువర్గాలు వివాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొర్రెకుంట గ్రామ శివారులో సర్వే నెంబర్ 197G/H/Jకు సంబంధించిన భూమిపై కొంతకాలంగా భూ తగాదా కొనసాగుతోంది. గురువారం ఉదయం తిరుపతిరెడ్డి తన అనుచరులతో కలిసి సంబంధిత భూమిలో నిర్మాణ పనులు చేపట్టగా, మరో వర్గానికి చెందిన వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న గీసుగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తహసిల్దార్ ఎదుట కౌన్సిలింగ్
గతంలో నమోదైన కేసులు, రెవెన్యూ నివేదికలు, కోర్టు పత్రాలను పరిశీలించిన అనంతరం సీఐ విశ్వేశ్వర్ ఇరువర్గాలను గీసుగొండ తహసిల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ ఎదుట హాజరు పరచి కౌన్సిలింగ్ నిర్వహించారు. 2012లో దాఖలైన సివిల్ సూట్‌కు సంబంధించిన అడ్వకేట్ కమిషనర్ నివేదిక, సర్వే శాఖ నివేదిక, ఆర్డీఓ రిపోర్టుల ఆధారంగా తిరుపతిరెడ్డి వర్గానికి చెందిన భూ రికార్డులు సక్రమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వెల్ది సాంబయ్య తదితరులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టును ఆశ్రయించి చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని సూచించారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇరువర్గాలకు స్పష్టంగా హెచ్చరించారు.


