కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ విశ్వరూపం
ప్రజల పక్షాన పోరాటం ఉధృతం
కాంగ్రెస్ వైఫల్యాలపై ఎండగడుతాం
కేసీఆర్ రాకతో అసెంబ్లీ దద్దరిల్లుతుంది
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కాకతీయ, తొర్రూరు : ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కొత్త సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ విశ్వరూపం చూపిస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. శనివారం డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పల్లె ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారని దయాకర్ రావు పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులనే ప్రజలు గుర్తుచేసుకొని ఓటు వేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో ప్రజలను మోసగించిందని ఆరోపించారు. రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, అందుకే మతి భ్రమించి కారు గుర్తుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన విశ్వరూపం ఏంటో తెలుస్తుందని, అప్పుడు రేవంత్ రెడ్డి, మంత్రులకు నిద్ర కూడా ఉండదని అన్నారు. నూతన సంవత్సరంలో కొత్త ఉత్సాహంతో పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని దయాకర్ రావు తెలిపారు. ఏ ఎన్నిక ఎదురైనా బీఆర్ఎస్ పార్టీ దీటుగా పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోబీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, మాజీ కౌన్సిలర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, భోజ్య తండా సర్పంచ్ మాలోత్ మౌనిక సంతోష్, నాయకులు జై సింగ్ నాయక్, తూర్పాటి రవి, రాయిశెట్టి వెంకన్న, మాలోతు కోటిరాం, భీమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.


